1. మహిమ్నః పారం తే

అవతారిక

శివభక్తుడైన పుష్పదంతాచార్యుఁడు తానీ స్తోత్రముజేయుట నింద్యము కాదని సమర్థించుకొనుచున్నాఁడు.

శ్లోకము

మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః ।
అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర! నిరపవాదః పరికరః ॥ ౧॥



(కవి ఇందు పూర్వార్ధమున తన స్తుతి అయోగ్యత్వమును ప్రతిపాదించి పరమేశ్వరుని అగ్రాహ్యత్వమును సూచించున్నాడు । ఉత్తరార్ధమున సర్వ స్తోత్రముల యొక్క యోగ్యతను సమర్థించి తన అమోఘ కవితా కౌశల్యమును చాటుచున్నాడు )

అన్వయము

హేహర, స్తోతుః సర్వాణీ దుఃఖాని పాపాని వా హర తీతి హర ఇతి సంబోధనం.
తవ మహిమ్నః పరం పారం అవిదుషః స్తుతిః అసదృశీ అయోగ్యా ఏవ - ఓశంకరా, నీమహిమ యొక్క అంతము పూర్తిగా తెలియనివాఁడు అనఁగా నీమహిమ ఇంత యని తెలియనివాఁడు నిన్ను గుఱించి చేసినస్తోత్రము అయోగ్య మైనదే యని భావము.
తర్హి బ్రహ్మాదీనాం సర్వజ్ఞానామపి గుణకథనరూపా గికః త్వయి విషయే అవసన్నా ఆయోగ్యా = అందువలన సర్వజ్ఞులైన బ్రహ్మాది దేవ తలయొక్క నీ గుణవర్ణ నరూపమైన స్తోత్రములును అయోగ్య. మైనవే కాఁగలవు. వారును నీమహిమను పూర్తిగా తెలియని వారైనందున వారిచేత చేయఁబడిన స్తుతి కూడ నింద్యమైనదే కావలసివచ్చును.
అథ - అర్థాంతరముచేత తన స్తోత్రమునకు యోగ్యత్వమును నిరూపించుచున్నారు.
తత్ = అందువలన,
స్వమతిపరిణామావధి గృణన్ సర్వో ఒపి స్తుతిః అవసన్నా : తన యొక్క బుద్ధివృత్తికి గోచరమైనంత గ్రహించి చేసిన స్తోత్రము అంతయు—అందరిస్తోత్ర మును యోగ్యమైనదే కాగలదు. అందు వలన,
మమాపి తవ స్తోత్రే స్తోత్ర విషయే ఆరంభః అనిరపవాదః= నాకుఁ గూడ నీస్తోత్ర విషయమైన ఆరంభము (నమస్కారానిక మగునుద్యమము) ఖండనీయము కానేరదు. అనఁగా యోగ్య మైనదియే యని భావము

తాత్పర్యము

ఓ శివా! నీ మహిమయొక్క యంతము నెఱుంగుటయశక్యమని బ్రహ్మాదులే వచింపుచుఁదుదకుఁదమ శక్తికొలఁది మతించి సఫలమనోరథులైరి. కావున యథాశక్తిగా నేను నుతింపఁ బూనుటయు నింద్యము కానని తాత్పర్యము.

సాహిత్య విషయములు

వృత్తము - శిఖరిణీ

మధుసూదన సరస్వతి వ్యాఖ్య

ఒకానొక గంధర్వరా జొక రాజోద్యానమునందలి కుసుమములను గోసికొని పోవుచుండెను. ఆతనిని గనుఁగొనుటకై శివనిర్మాల్యమును దాఁటినచో నాతనియంత ర్ధానాదిశక్తు లన్నియు నశించునని తలంచి, యాతఁడు వచ్చుమార్గమున నారాజు శివనిర్మాల్యము నుంచియుండెను. ఆగంధర్వరా జది యెఱుఁగమిఁ బ్రవేశించునపుడే యాతనిశక్తి మొక్కవోయెను. అంత నాతఁడు శివనిర్మాల్యమును దాఁటుటచేఁ దన కట్టి స్థితి గల్గె సని ప్రణిధానమున నెఱింగి, పరమ కారుణికుండును సకల కామ ప్రదుండునగు పరమేశ్వరుని స్తుతించె నని పురాణకథ.

స్తుతి యనునది గుణములను గీర్తించుట యగుఁ గదా. అది గుణములను దెలిసియుండినఁ గాని సాధ్యము గాదు. తెలిసికొను టకు శక్యుఁడు కాని భగవంతుని గీర్తించుట యసంభవ మగుటవల నను, అసంతములగు నాతనిగుణములఁ దెలిసికొనుటకు సాధ్యము గాకుండుట వలనను, ఆతనిని గీర్తించెడి స్తుతి యెట్టు లను రూపమై యుండఁగలదు? అనురూపము గానిస్తుతి కేవలము హాస్యాస్పద మనుశంక రాఁగా, దానిని వారించెడి నెపమునఁ దనయనౌధ్ధత్యమును బ్రదర్శించుచు, భగవంతుని స్తుతించుట కారంభించుచున్నారు.

మరియొకరీతిని వ్యాఖ్యానము

స్వమతిపరిణామావధి గృణన్ సర్వోఽపి జనః అవాచ్యః: (ఆభిముఖ్యేన వాచ్యః) తవ స్తోత్రః అనిరపవాదః = సర్వజనస్తోత్ర ములు తమతమ బుద్ధివృత్తికి గోచరమైనంత నీమహిమను గ్రహించి స్తోత్ర కాలమందు నీయొక్క ఆభిముఖ్యమును (సన్నిధిని) భావించి నీతో సంభాషించుచు చేసిన స్తోత్రము లన్నియు యోగ్య ములే కాఁగలవు.
అందువలన నాయుద్యమము నింద్యమైనది కాదని భావము. పర మేశ్వరుఁడు సర్వజ్ఞుఁడై నందున సర్వసముఁ డైనందున స్తోత్రముయొక్క పరిశ్రమమును స్తోత్రమందుఁ గల గుణదోషములను గ్రహించతగినవాఁ డైనందున తన సాన్నిధ్య మహిమవలన నట్టిస్తోత్రము సఫలమైనది కాఁగలదని భావము.

ఇందువలన శ్లోక పూర్వార్ధముచే స్తుతినిరాకరణమనుమిషతో పర మేశ్వరుఁడు బ్రహ్మాదులకుఁ గూడ తెలియఁదగని అపారమయిన మహిమకలవాఁడనియు, ఉత్తరార్ధముచేత స్తోతయొక్క వినయా జకమును, నిరహంభావనయును చూపింపఁబడినవి. గంధర్వరాజు తన బుద్ధికుశలత వలన పరమేశ్వరుని సర్వోత్కృష్టునిగా స్తుతించి నాఁడు. ఇంతేగాక సరమేశ్వరుని స్తుతించుటకును వారి ప్రసాద మునుబొందుటకును సర్వజ్ఞులైన బ్రహ్మదులును, కించిజ్ఞులైన అస్మ బాదులు సమానమేయని భావము. గ్రంథకర్త ఒకశ్లోకముచేత నే తమ విద్యాసామర్థ్యముచేతను, బుద్ధికుశలత వలనను పరమేశ్వ రుని వేద ప్రమాణసిద్ధునిగా వర్ణించి స్తోత్రమును చేసినారు.

ఈశ్లోకమున పూర్వార్ధమందు పరమేశ్వరుని మహిమను పూర్తిగా తెలియనివాఁడు చేసిన స్తోత్ర ము సఫలము కానేరదని ఒక అన్వయము. అందువలన బ్రహ్మాదులస్తోత్రములును అయోగ్యములే అని రెండవ అన్వయము.

ఇందువలన పరమేశ్వరస్తోత్రములను నిరాకరించుచు అపారమైనమహిమకలవాడని స్తుతించిరి. ఆ పక్షమందుపర మేశ్వరుని స్తుతించుటయే యసంభవమనెడియాక్షేపణకాగా, పరమేశ్వరుని యనుగ్రహము కలిగెడి ప్రకారాంతరమైన ఉపాయమును మూడవ అన్వయముచేత చూపించిరి.

ఎట్లనిన: అవాచ్యః-తవ-ఆభిము ఖ్యేన భావయ వాచ్యఃస్తోతవ్యః = నీయొక్క అభిముఖమును భావించి నీతో సంభాషించుచు,
స్వమతిపరిణామా వధి గృణ౯ =తనయొక్క బుద్ధివృత్తులకు గోచరమైనంతమట్టుకు నీమహిమను గ్రహించి స్తుతించినపుడు అందరిస్తోత్రములును యోగ్యమైనవే కాఁగలవని తన స్తుతికి సార్థక్యమును జూపుచు బ్రహ్మాదులస్తోత్రములును అట్లు భావించినపుడు సఫలములు. యోగ్యములే అగునని మూడవ అన్వయము. ఇంతమట్టుకు గ్రంథ మందున్న అభిప్రాయము వ్యాఖ్యానమువలనఁ దెలియుచున్నది. ఇది బాహ్యార్థము.

పద్యానువాదము

శ్రీకరమైన నీ మహిమసీమ నెఱుంగని వారి సన్నుతుల్
స్తోకములైనచో, జలజ సూతిముఖామరసం స్తవంబు ల-
ట్లే కద, కాన ధీకొలఁది నెవ్వఁడు నైన నుతింప నొప్పుచో
నీకరణి న్నుతించెద మహేశ్వర! మత్కృతి దోష ముండునే?